Tuesday, 10 November 2020

గోవిందరాజస్వామి ఆలయంలో కోవిల్ ఆల్వార్ తిరుమంజనం...


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో న‌వంబ‌రు 14వ తేదీన‌ దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.  అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి.శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
న‌వంబరు 14న దీపావళి ఆస్థానం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబరు 14వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఆస్థానం  జరుగనుంది.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment