Saturday, 2 July 2022

జిల్లా ఎస్పీగా వినిత్ జీ


*కొత్తగూడెం:* జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్‌డీగా పనిచేస్తున్న డా.వినిత్‌ జీకి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీగా సునీల్‌దత్‌ సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. 2018, సెప్టెంబరు 11న బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై పట్టు సాధించారు.

సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల చొరబాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ విషయంలో ఇతర పోలీసు అధికారులతో సమష్టిగా పనిచేశారు. ఆయన హయాంలో జరిగిన ఘటనల్లో దాదాపు 8 మంది మావోయిస్టులు, కీలక నేతలు మరణించారు. 117 మందిని అరెస్టు చేశారు. 324 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారు. ఇదే క్రమంలో మారుమూల ఆదివాసీ గూడేల్లో సోలార్‌ విద్యుద్దీపాల ఏర్పాటు, తాగునీటి పరికరాలు, దోమ తెరలు, క్రీడా సామిగ్రి పంపిణీ వంటి చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో పోలీసు భవనాల నిర్మాణాలతో పాటు సిబ్బంది సంక్షేమానికి తగిన చొరవ చూపారు. హేమచంద్రాపురం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఫైరింగ్‌ రేంజ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా రానున్న డా.వినిత్‌ జీ 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. తొలి పోస్టింగ్‌ భద్రాచలం ఏఎస్పీగా పొందారు. అక్కడ ఏడాది పాటు పనిచేశారు. అనంతరం 2020లో నిజామాబాద్‌ ఏఎస్పీగా బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి కొద్ది నెలల క్రితం మళ్లీ కొత్తగూడెం ఓఎస్‌డీగా తిరిగొచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ఎస్పీగా నియమితులయ్యారు. ఏఎస్పీగా మావోయిస్టు కార్యకలాపాలను నిలువరించడంలో గతంలో సునీల్‌దత్‌కు వినిత్‌ జీ తనవంతు సహకారం అందించడంతో పాటు మన్యం ప్రాంత విధుల్లో కీలక పాత్ర పోషించారు.

*భద్రాచలం ఏఎస్పీగా రోహిత్‌రాజ్‌*

ఏఎస్పీగా నేడు రోహిత్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన అధికారి శిక్షణకు సెలవుపై వెళ్లారు. దీంతో పాల్వంచ(గ్రేహండ్స్‌)కు చెందిన రోహిత్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

No comments:

Post a Comment