Tuesday, 19 July 2022

గోదావరి వరద బాధితులలో ధైర్యం నింపిన ఖమ్మం కలేక్టర్, సి.పి.లు.... ప్రభుత్త్వ సాయం పై భరోసా...


భద్రాచలం : వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి పరిశీలించి, బాధితులకు ధైర్యం తో పాటు, ప్రభుత్వ సహాయం పై భరోసా కల్పించారు. బూర్గంపహడ్ మండలం, లక్ష్మీపురం గ్రామ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్, పోలీస్ కమీషనర్ లు పరిశీలించారు. 230 కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నట్లు, వారికి భోజనం, వసతి కల్పన చేసినట్లు వారు తెలిపారు. నిత్యావసర వస్తువులు పప్పు, ఉల్లిపాయలు, కారం, పసుపు, నూనె తదితరాలు అందజేస్తున్నట్లు వారు అన్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లు , ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం క్రింద రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ముంపు బాధితులు ఈ సందర్భంగా తమ ఇళ్ల వద్ద కరంట్, త్రాగునీరు లేదని, పారిశుద్ధ్యం చేయాలని కోరగా, కరంట్ ఉంది కాని భద్రత దృష్ట్యా ఇవ్వడం లేదని, తడి ఆరి ఇబ్బంది లేదన్నాక కరంట్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని, పైపులు పాడై, బురద చేరడంతో త్రాగునీటి సరఫరా కు అంతరాయం కలుగుతుందని, మురికినీరు వస్తున్నట్లు, ట్యాoకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు, నీటిని వేడిచేసి చల్లార్చి త్రాగాలని అన్నారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు, ఒకటి రెండ్రోజుల్లో అంతా శుభ్రం కానున్నట్లు వారు తెలిపారు. అధికారులు అనుమతి ఇచ్చేవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారు బాధితులను కోరారు.అనంతరం ఖమ్మం కలెక్టర్ నాగినేనిప్రోలు గ్రామానికి వెళ్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాల ఖాతా సంఖ్య, వివరాలు నమోదు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ అన్నారు. గ్రామంలో ఆయన పర్యటించి, ముంపు ఇళ్లను పరిశీలించారు. వరదతో నష్ట పోయిన ప్రతి ఇంటికి సహాయం చేస్తామన్నారు. వరద ఎంతమేర వచ్చింది, ఏ ఏ ప్రదేశాలు చాలా ప్రభావితం అయ్యాయి అడిగి తెలుసుకుని, కలెక్టర్ అంతా స్వయంగా కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. మిషన్ భగీరథ నల్లా నీటిని పరిశీలించారు. నీరు తప్పకుండా వేడిచేసి, చల్లార్చిన తర్వాత త్రాగాలన్నారు. అనంతరం మోరాంచపల్లి బంజార గ్రామం స్టెల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, వివరాల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మోతేపట్టినగర్ గ్రామానికి వెళుతూ, మార్గ మధ్యలో అశ్వాపురం మండలం గరిఒడ్డు గ్రామం వద్ద కల్వర్టు దగ్గర వరద పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుపై బురద మేట వేయడంతో వాహనాలు జారుతున్నట్లు, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండడంతో, వెంటనే ట్యాoకర్ల ద్వారా రోడ్డుపై ఉన్న బురద మేట ను తొలగించి, శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బూర్గంపహాడ్ మండలం మోతెపట్టినగర్ గ్రామంలో పర్యటించి ముంపు ఇళ్లను పరిశీలించారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. ప్రతి సంవత్సరం ముంపు భయం లేకుండా, లోతట్టు ప్రాంతాల వారికి శాశ్వత ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా ప్రణాళిక చేస్తామన్నారు. అనంతరం తాళ్లగొమ్మూరు పంచాయతీ లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ తనిఖీ చేశారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో భోజన, వసతులు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
     
     కలెక్టర్ పర్యటన సందర్భంగా ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపివో హరిప్రసాద్, కొత్తగూడెం డిఇఓ సోమశేఖర శర్మ, బూర్గంపహాడ్ ఎంపిడివో వివేక్ రామ్, తహసీల్దార్ భగవాన్, జెడ్పిటిసి శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment