Sunday, 10 December 2023

100 రోజుల్లో హామీలు పూర్తి అమలు... జిల్లా మంత్రులకు అడుగడుగునా అఖండ స్వాగతం...


ఖమ్మం, డిసెంబర్ 10: ఖమ్మం పాత బస్టాండ్లో మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ బస్సును రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క,  రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ, హౌజింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ప్రారంభించారు. పాత బస్టాండ్ ఆవరణలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ప్రయాణికులను ఉద్దేశించిమాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను  అమలు చేస్తామని ఇచ్చిన మాటను విశ్వసించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసమే సంపద సృష్టిస్తామని, రాష్ట్ర వనరులు రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తామని ఆయన తెలిపారు. సంపద సృష్టిoచి, ప్రజలకు పంచుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో అధికారులకు వచ్చిన రెండు రోజుల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేసి చూపించామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పినట్టుగా తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్న దానికి మీరే సాక్ష్యమని ఆయన అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు కంకణ భద్ధులమై పనిచేస్తామన్నారు. కొలువులు, ఇండ్లు, నీటి పారుదల, ఇంటి స్థలాలు, పోడు భూముల సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఇక ఉండదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. 
కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను రెండు రోజుల్లోనే అమలు చేశామని, మిగతా గ్యారంటీలు త్వరలోనే కార్యరూపం దాల్చుతాయన్నారు. 
కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 6 గ్యారంటీల ద్వారా ప్రజలకు ఇచ్చిన భరోసాలో రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. శనివారం నుండి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామనన్నారు. నిరుపేదల ఆరోగ్య రక్షణకు, రూ. 5 లక్షల పరిమితి ఉన్న ఆరోగ్యశ్రీ ని రూ. 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, టీఎస్ ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, డిఆర్డీవో విద్యాచందన, డిడబ్యుఓ సుమ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment