Monday, 4 December 2023

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రెడ్ ఏలర్టు



ఖమ్మం, డిశంబర్ 4: మిచౌoగ్ తుఫాను దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటీంచిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, ఇర్రిగేషన్, మత్స్య శాఖల అధికారులతో భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాగల రెండు రోజుల్లో జిల్లాలోని ఎర్రుపాలెం, మధిర, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో 200 మిమి. కు పైగా, మిగతా మండలాల్లో 100 మిమి కు పైగా వర్షపాత సూచన ఉందన్నారు. జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.  జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ప్రజలు సహాయానికి 24/7 ఫోన్‌ నెం. 9063211298, టోల్‌ఫ్రీ నెం.1077కు కాల్‌ చేయాలని ఫోన్‌ నెం.కు వాట్సాప్‌ కూడా చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలోని చెరువులు, నీటి వనరులపై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలోని 360 చెరువుల్లో ఇప్పటికే 75 నుండి 100 శాతం నీరు నిండి ఉందని ఆయన అన్నారు. చెరువులు, వాగుల్లోకి ప్రజలు వెళ్ళకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు.  జిల్లాలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, కాల్వల నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన సూచించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద మత్తడి పొంగిపొర్లే ప్రాంతాలను గుర్తించి 24 గంటలు పర్యవేక్షించాలని ఆయన అన్నారు.  జిల్లా అధికారులు తహశీల్దారులు,  ఎంపిడిఓ, ఎంపివోలు బారీ వర్షాల నేపథ్యంలో హెడ్‌క్వార్టర్‌లో ఉండి సమన్వయంతో పనులు చేయాలన్నారు. చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడానికి అనుమతించవద్దని ఆయన అన్నారు. కల్వర్టులు, రోడ్లపై ప్రవాహాలు వున్నచోట రహదారిని మూసివేయాలని, ప్రజలు దాటకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మధిర, సత్తుపల్లి లలో పడవలు సిద్ధంగా ఉంచాలన్నారు. మంగళవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు, హాస్టల్ విద్యార్థులను ఎక్కడికి పంపకుండా, హాస్టళ్లలోనే ఉండేలా చూడాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం అందుబాటులో ఉంచుకొని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌  అన్నారు. దామిని యాప్ గురించి అవగాహన కల్పించి, పిడుగుల నుండి రక్షణ పొందేలా చైతన్యం తేవాలన్నారు.సమీక్ష లో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు డ్రాగన్2లైట్స్, ట్రీ కట్టారు6, రోప్స్, జాకెట్స్, పిఏ సిస్టమ్ లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటి ప్రవాహాల వద్ద వలంటీర్లను ఉంచాలన్నారు. బ్యారికేట్స్ అవసరం ఉన్న ప్రతిచోట పెట్టాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
    ఈ సమీక్ష లో స్థానిక అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇర్రిగేషన్ సిఇ కె. విద్యాసాగర్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, డిపిఓ హరికిషన్, డిఇఓ సోమశేఖరశర్మ, ఎడి ఫిషరీస్ ఆంజనేయ స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment