Thursday, 7 December 2023

ఘనంగా పతాక దినోత్సవము.. స్వచ్ఛంద విరాళాలు ఇచ్చిన కలెక్టర్,సి.పి లు..

ఖమ్మం : ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయము లో ఘనంగా సాయుధ దళముల పతాక దినోత్సవము నిర్వహించారు. 74 వ సాయుధ దళముల పతాక దినోత్సవమును ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయములో ఘనముగా జరుపుకొన్నారు. 
ఎన్ సి సి కాడేట్ లు, మాజీ సైనికులు మాజీ సైనిక వితంతువుల సమక్షములో సీనియర్ మాజీ సైనికుడు అవిభాజ్య ఖమ్మం జిల్లా లో ఏకైక గాలంటరీ అవార్డు గ్రహీత ఎన్.రోశయ్య  త్రివిధ దళముల పతాకమును ఎగురవేసి అందరికి స్టిక్కర్లను అతికించి విరాళములను సేకరించినారు. గత సంవత్సర సాయుధ దళముల పతాక దినోత్సవము సందర్భముగా సేకరించిన విరాళముల లో రాష్ట్రము లో నే(జంట నగరములు మినహాయించి) ప్రధమ బహుమతి ని తీసుకొనుటకు గాను రాజ్ భవన్ కు వెళ్ళిన వారికి  ఫోన్లో
శుభాకాంక్షలు తెలిపినారు. సైనిక, నావిక మరియు వైమానిక దళములలో మాతృ దేశ రక్షణకై అసువులు బాసిన సమరయోధుల త్యాగనిరతికి, ధైర్య సాహసములకు, దేశ భక్తికి జోహార్లు అర్పించుచూ వారి సేవలను గుర్తించుచూ దేశ రక్షణకు నిరంతరము సేవ చేయుచున్న త్రివిధ దళములను ఉత్తేజ పరచు ఉద్దేశ్యముతో ఈ పతాక దినోత్సవమును గత డెబ్బై నాలుగు సంవత్సరములుగా జరుపుకోనుచున్నాము. దేశ శాంతి భద్రతలను కాపాడుకొనుటకు, యుద్ధ సమయములయందు దేశ రక్షణలోనూ, ప్రకృతి విపత్తులలో మన సాయుధ దళములు చేయుచున్న సేవలు మరువలేనివి. ప్రతి ఒక్కరు ఈ పవిత్ర కార్యములో పాలు పంచుకొని దేశ భక్తిని దాటుకోవలెనని, ప్రకృతి విపత్తులలో వారి సేవలకు, దేశ రక్షణే ప్రధమ ధ్యేయముగా పెట్టుకొని విధి నిర్వహణలో అసువులు బాసిన, వికలాంగులైన వీర యోధుల కుటుంబములకు, మాజీ సైనికులకు, దేశ ప్రజలందరూ ఎంతో ఋణపడి ఉన్నారు. వారికి చేయూత నిచ్చి, వారి సంక్షేమ, పునరావాసములకు, పాటుపడుట మనందరి కర్తవ్యము. ఈ కార్య నిర్వహణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టియున్నారు. అయితే వాటికి ప్రభుత్వ కృషియే కాక ప్రజల సహాయ సహకారములు కూడా ఎంతో అవసరము. ఈ సందర్భమున సేకరించిన విరాళములను పతాక దినోత్సవ నిధికి జమ చేయబడును. అట్టి విరాళములను మాతృ దేశ రక్షణకు అసువులు బాసిన మరియు వికలాంగులైన వీరయోధులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల పునరావాస కార్యక్రమములకై వినియోగించబడును.
స్వచ్ఛంద విరాళములకు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు, ఆర్థిక మంత్రిత్వ శాఖ వారి ఉత్తర్వు సి.డబ్ల్యు ఎ. ఓ.69/12- 1/54, ది.06-03-1954 ప్రకారము సెక్షన్ 15-బి మరియు వారి నోటీసు నెం.78/2007 ది. 26-03-2007 ప్రకారం క్రింద మినహాయింపు కలదు.
జిల్లాలోని ప్రజలు, సినిమా హాలు, పరిశ్రమల యజమానులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్వచ్చందముగా విరాళములు ఇవ్వవలసినదిగా మరియు మీ వద్దకు వచ్చే పిల్లలకు, మాజీ సైనికులకు, ఎన్.సి.సి. కాడేట్ లకు సహకరించి హుండీ బాక్స్ ల లోను, స్టిక్కర్లు, కార్ ఫ్లాగ్ ల ద్వారా విరివిగా విరాళములను ఇవ్వవలసినదిగా పత్రికాముఖముగా కోరనైనది. మీ స్వచ్చంద విరాళములను సందాలకులు, సైనిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ ను నేరుగా గాని, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వారి కార్యాలయము, ఖమ్మం నకు గాని పంపగలరని శ్రీ కె. శ్రీరామ్ కోరారు.కార్యాలయ సిబ్బంది, మాజీ సైనికులతో కలసి గౌరవ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఖమ్మం కమీషనర్ అఫ్ పోలీస్  విష్ణు ఎస్ వారియర్ లను కలసి స్టికర్ లను అంటించి వారికి సాయుధ దళముల పతాక దినోత్సవ టోపీ (CAP) లను ఇచ్చి విరాళములను సేకరించినారు. దీనిలో కార్యాలయ సిబ్బంది శ్రీ కె. శ్రీనివాస రావు. శ్రీ షేక్ హైమత్ మాజీ సైనిక సంక్షేమ సంఘ అద్యక్షులు శ్రీ సుబాని గారు, మాజీ సైనికులు శ్రీ గోపాల రావు గారు, శ్రీ అంబటి సురేష్ గారు, రజాక్ మొహమ్మద్ గారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment