Saturday, 9 December 2023

"మహాలక్ష్మీ"తో మహిళా సాధికారత : కలెక్టర్ వి.పి. గౌతమ్


ఖమ్మం, డిసెంబర్ 9: మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్ స్థానిక నూతన బస్ స్టేషన్ లో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు ఇంటికి పరిమితం కాకుండా బయటకు వచ్చి, సామాజికంగా, ఆర్థికంగా క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రయాణానికి మెజారిటీ ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు, మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్థిక భారం తగ్గనున్నట్లు ఆయన అన్నారు. ప్రస్తుతమున్న లెక్కల ప్రతిరోజూ 40 నుండి 50 వేల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నట్లు, మహాలక్ష్మి పథకంతో ఈ సంఖ్య పెరుగుతుందన్నారు. చిన్న పాప నుండి పెద్దవాళ్ళ దాకా, వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికి, ట్రాన్సజెండర్లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర పరిధిలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ఈ పథకం పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు వర్తిస్తుందని, జిల్లాలో ఈ రకమైన సర్వీసులకు 371 బస్సులు ఉన్నాయని ఆయన తెలిపారు. బస్సుల ఛార్జీలతో దూరం వెళ్లి చడవలేక అమ్మాయిలు చదువు మానివేసేవారని ఆయన అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సిహెచ్. వెంకన్న, జిల్లా రవాణాధికారి టి. కిషన్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యాచందన, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment