ప్రజలంతా ఇండ్లలోనే వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్ విజ్ఞప్తి చేశారు.
*కరోనా కేసులు మరింత ఉదృతమవుతున్న క్రమంలో మరింత కఠినంగా నిబంధనలు చేయాల్సిన అవసరం వున్నందున బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నవరాత్రుల కోసం వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దని ఏసీపీ సూచించారు. వినాయక చవితి పర్వదినోత్సవం క్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇప్పటికే పట్టణాల్లో విగ్రహాల తయారీ జరుగుతోంది. మరోవైపు మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితులు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో అన్ని స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏసీపీ రహమాన్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ తో ఇప్పటికే జనజీవనం గందరగోళంలో పడినందున వినాయక మండపాల వద్ద నైవేద్యం, ప్రసాదాల వితరణ, భజన కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే వైరస్ మరింతగా వ్యాప్తిచెందే ప్రమాదముందని భావించి పోలీస్ శాఖ ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
No comments:
Post a Comment